
భారత పార్లమెంటు (సన్‌సద్) లో దిగువ సభను లోక్‌సభ (Loksabha) అంటారు. లోక్‌సభ సభ్యులను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ప్రజల ప్రత్యక్ష ప్రాతినిధ్యం ఉండే సభ కనుక ఇది ప్రజల సభ (House of the People) అయింది. రాజ్యాంగం ప్రకారం లోక్‌సభలో గరిష్ఠంగా 552 మంది సభ్యులు ఉండవచ్చు. అందులో 530 మంది రాష్ట్రాల నుండి, 20 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నికైన సభ్యులు కాగా, మిగిలిన ఇద్దరు రాష్ట్రపతి చే నామినేట్ చెయ్యబడ్డ ఆంగ్లో ఇండియన్ సభ్యులు.
లోక్‌సభ సభ్యులను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలు (General Elections) అంటారు. వోటర్ల సంఖ్య రీత్యా, ఎన్నికల పరిమాణం రీత్యా భారత సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత భారీ ఎన్నికలు.
కాల పరిమితి:--
లోక్‌సభ కాలపరిమితి ఐదేళ్ళు. ఎన్నికలు జరిగిన వెంటనే జరిగే మొదటి సమావేశం తేదీ నుండి 5 సంవత్సరాలకు ఆ లోక్‌సభ గడువు తీరిపోతుంది. అయితే ఆత్యయిక పరిస్థితి విధించిన సమయంలో ఈ పరిమితిని ఒక్కో సంవత్సరం చొప్పున పొడిగించుకుంటూ పోవచ్చు. అయితే, ఆత్యయిక పరిస్థితిని ఎత్తివేసిన తరువాత 6 నెలలకు మించి పొడిగించేందుకు వీలులేదు. అయితే, సభను ఐదేళ్ళ కంటే ముందే రద్దు చేయ్యవచ్చు.
జీతభత్యాలు:--
చరణ్‌దాస్ మహంత్ నేతృత్వంలోని ఎంపీల వేతనాలు, భత్యాల పార్లమెంటరీ సంయుక్త కమిటీ చేసిన సిఫార్సులు:
ఎంపీల వేతనాన్ని నెలకు రూ.16 వేల నుంచి రూ.80,001కి పెంచాలి.
పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ఎంపీకి ఒక రోజుకి ప్రస్తుతం ఇస్తున్న భత్యం రూ.వెయ్యిని రూ.2 వేలకు పెంచాలి.
ఎంపీలు తమ నియోజకవర్గాలకు వెళ్లేందుకు 34 ఉచిత విమాన ప్రయాణాలకు అనుమతించాలి.
అధికారాలు:---
పార్లమెంటులో ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే ప్రజలసభయైన లోక్‌సభకు విశేష అధికారాలున్నాయి. ఆర్థికాధికారాల్లో, మంత్రిమండలిని తొలగించే విషయంలో లోక్‌సభకు ప్రత్యేక అధికారాలున్నాయి. ఇంకా శాసన నిర్మాణాధికారాలు, ఆర్థిక, న్యాయ సంబంధ, రాజ్యాంగ సవరణ, ఎన్నిక పరమైన, కార్యనిర్వాహక శాఖపై నియంత్రనాధికారాలు లోక్ సభకు ఉంటాయి.
శాసన నిర్మాణాధికారాలు:--
ఆర్థిక బిల్లులతోబాటు సాధారణ బిల్లులను కూడా లోక్‌సభలో ప్రవేశపెట్టవచ్చు.సాధారణ బిల్లులు కేంద్ర ప్రభుత్వ ఆర్థికేతర, పాలనా పరమైన వ్యవహారాలకు సంబంధించినవి. ఆర్థిక బిల్లులు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నిర్వహణకు సంబంధించినవి. సాధారణ బిల్లులను ఏ సభలోనైనా మొదట ప్రవేశపెట్టవచ్చును.
రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ లో పేర్కొన్న అధికారాల జాబితాలో కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట అధికారాలపై లోక్‌సభ శాసనాలు చేస్తుంది. రాష్ట్ర జాబితాపై కూడా ఇది శాసనాలు చేస్తుంది.
ఆర్థికాధికారాలు:--
ఆర్థికాధికారాల విషయంలో రాజ్యసభ అధికారాలు నామమాత్రం. లోక్‌సభకు ఆర్థిక విషయాల్లో ఎక్కువ అధికారాలున్నాయి. ఉదాహణకు
వార్షికాదాయ, వ్యయ పట్టిక (బడ్జెట్) ను లోక్‌సభలో ప్రవేశపెట్టడం
పన్నుల విధింపు, తొలగింపు, తగ్గింపు
ప్రభుత్వం చేసే ఋణాలకు పరిమితి విధించడం
ఒక బిల్లు సాధారణ బిల్లు అవుతుందా, ఆర్థిక బిల్లు అవుతుందా అనే విషయాన్ని లోక్‌సభ స్పీకర్ నిర్ణయిస్తాడు. లోక్‌సభ స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయడానికి లేదు.స్పీకర్ ఒక బిల్లును ఆర్థిక బిల్లు అని ధృవీకరించిన తర్వాత రాష్ట్రపతి అనుమతితోనే మొదట దాన్ని లోక్‌సభలో ప్రవేశపెడతారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత దాన్ని రాజ్యసభకు పంపుతారు. రాజ్యసభ దాన్ని 14 రోజుల్లోగా అనుమతించి తిరిగి లోక్‌సభకు పంపాలి. ఏ కారణంతోనైనా రాజ్యసభ ఆర్థిక బిల్లును ఆమోదించక చేర్పులు, మార్పులను సూచించి పంపితే, లోక్‌సభ ఆ ప్రతిపాదనలను ఆమోదించవచ్చు.
న్యాయ సంబంధమైన అధికారాలు:--
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్, యు.పి.ఎస్.సి చైర్మన్ మొదలైనవారి తొలగింపు విషయంలో లోక్‌సభకు అధికారం ఉంటుంది. రాష్ట్రపతిని తొలగించేందుకు ఏ సభలోనైనా మొదట మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. ఉపరాష్ట్రపతిని తొలగించాలంటే మొదట రాజ్యసభలోనే అభియోగ తీర్మానం ప్రవేశపెట్టాలి.
రాజ్యాంగ సవరణ అధికారం:--
368 నిబంధన ప్రకారం రాజ్యాంగ సవరణను ప్రతిపాదించే అధికారం లోక్‌సభకు ఉంది. రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లును కూడా ఉభయ సభలు ఆరు నెలల్లోగా ఆమోదించాలి. ఒకవేళ అలా ఆమోదించకపోతే ఆ బిల్లు వీగిపోతుంది. రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసే అవకాశం లేదు.
ఎన్నిక పరమైన అధికారాలు:--
రాష్ట్రపతి ఎన్నిక నిమిత్తం నియోజక గణంలో లోక్‌సభ భాగంగా ఉంటుంది. అదే విధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా భాగంగా ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులు పాల్గొనే అవకాశం లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులు పాల్గొంటారు. లోక్‌సభ స్పీకర్ ను, ఉప స్పీకర్ ను లోక్‌సభ సభ్యులే ఎన్నుకుంటారు. రాజ్యసభ చైర్మన్ ను మాత్రం రాజ్యసభ సభ్యులు ఎన్నుకోరు. ఉపరాష్ట్రపతే రాజ్యసభకు చైర్మన్ గా వ్యవహరిస్తాడు. రాజ్యసభ సభ్యులు డిప్యూటీ చైర్మన్ ని ఎన్నుకుంటారు. లోక్ సభ వివిధ పార్లమెంటరీ కమిటీలకు సభ్యులను ఎన్నుకుంటుంది. పార్లమెంటు చేపట్టాల్సిన విధులు, బాద్యతలు పెరగడం, పార్లమెంటు సమావేశాల కాలవ్యవధి తక్కువగా ఉండటం వలన పార్లమెంటు తన విధులు, భాద్యతలు నెరవేర్చేందుకు పార్లమెంటరీ కమిటీలు సహాయం చేస్తాయి. ఉదాహరణకు అంచనాల సంఘం, ప్రణాళికా సంఘం మొదలైనవి.
నియంత్రణాధికారం:--
లోక్‌సభ అధికారాల్లో కార్యనిర్వాహక వర్గం కూడా ఒకటి. అంటే మంత్రిమండలిని నియంత్రించడం. భారత పార్లమెంటరీ వ్యవస్థలో మంత్రిమండలి లోక్‌సభకు భాద్యత వహిస్తుంది. మంత్రిమండలి లో ఎక్కువ లోక్‌సభ సభ్యులే కావడంతో లోక్‌సభకు బాధ్యత వహిస్తారు. లోక్‌సభ విశ్వాసం పొందినంత కాలం మాత్రమే మంత్రిమండలి అధికారంలో ఉండి, విశ్వాసం కోల్పోయిన తర్వాత వైదొలగాల్సి ఉంటుంది. కార్యనిర్వాహక వర్గంపై నియంత్రణను లోక్ సభ రెండు రకాలుగా చేపడుతుంది.
1.ప్రభుత్వ వ్యవహారాల గురించి సమాచారాన్ని తెలుసుకోవడం
2.ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం లేదా విమర్శించడం
వీటికోసం వివిధ పార్లమెంటరీ ప్రక్రియలను అనుసరిస్తుంది. ఈ ప్రక్రియల్లో ప్రశ్నోత్తరాలు, తీర్మానాలు ఉంటాయి.
అర్హతలు:--
భారతీయ పౌరులై ఉండాలి
25 ఏళ్ళ వయసు నిండి ఉండాలి.
పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి
నామినేషన్ తో పాటు రూ.10000/- చెల్లించాలి.
అనర్హతలు:--
ఒక వ్యక్తి ఏక కాలంలో ఉభయ సభల్లో సభ్యుడిగా కొనసాగలేడు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆదాయం పొందే పదవిలో ఉండటం
మతిస్థిమితం లేనివాడని న్యాయస్థానం ధృవీకరించడం
ఒక వ్యక్తి లోక్‌సభ సభ్యుడిగా కొనసాగడానికి అర్హత కోల్పోయాడా లేదా అనేది రాష్ట్రపతి నిర్ణయించడం జరుగుతుంది. దీనికోసం మొదట ఎన్నికల సంఘం అభిప్రాయం తీసుకుంటారు.
చరిత్ర:--
1950 జనవరి 26 న రాజ్యాంగం అమలు లోకి వచ్చిన తరువాత, మొదటి సార్వత్రిక ఎన్నికలు 1951-52 లో జరిగాయి. మొదటి ఎన్నికైన లోక్‌సభ ఏప్రిల్, 1952 న అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి వివిధ లోక్‌సభల వివరాలు ఇలా ఉన్నాయి:
లోక్‌సభ ఏర్పాటు స్పీకరు
మొదటి లోక్‌సభ ఏప్రిల్ 1952 జి.వి.మావలాంకర్, మాడభూషి అనంతశయనం అయ్యంగారు
రెండవ లోక్‌సభ ఏప్రిల్ 1957 మాడభూషి అనంతశయనం అయ్యంగారు
మూడవ లోక్‌సభ ఏప్రిల్ 1962 సర్దార్ హుకం సింగ్
నాలుగవ లోక్‌సభ మార్చి 1967 నీలం సంజీవరెడ్డి, జి.ఎస్.ధిల్లాన్
ఐదవ లోక్‌సభ మార్చి 1971 జి.ఎస్.ధిల్లాన్, బలిరాం భగత్
ఆరవ లోక్‌సభ మార్చి 1977 కె.ఎస్.హెగ్డే
ఏడవ లోక్‌సభ జనవరి 1980 బలరాం జాఖర్
ఎనిమిదవ లోక్‌సభ డిసెంబర్ 1984 బలరాం జాఖర్
తొమ్మిదవ లోక్‌సభ డిసెంబర్ 1989 రబీ రే
పదవ లోక్‌సభ జూన్ 1991 శివరాజ్ పాటిల్
పదకొండవ లోక్‌సభ మే 1996 పి.ఎ.సంగ్మా
పన్నెండవ లోక్‌సభ మార్చి 1998 గంటి మోహనచంద్ర బాలయోగి
పదమూడవ లోక్‌సభ అక్టోబర్ 1999 గంటి మోహనచంద్ర బాలయోగి, మనోహర్ జోషి
పదునాల్గవ లోక్‌సభ మే 2004 సోమనాథ్ చటర్జీ
పదహేనో లోక్‌సభ మే 2009 మీరా కుమార్
ఐదవ లోక్‌సభ సమయంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఆత్యయిక పరిస్థితి విధించి, సభ కాలపరిమితిని పొడిగించింది. లోక్‌సభ చరిత్రలో కాలపరిమితి పొడిగించబడిన సభ ఇదే.
సభా నిర్వహణ:--
లోక్‌సభా నిర్వహణ బాధ్యత ను స్పీకర్ నిర్వహిస్తారు. సభ్యులు తమలో ఒకరిని స్పీకర్‌గా ఎన్నుకుంటారు. స్పీకర్‌కు సహాయంగా ఒక డిప్యూటీ స్పీకర్‌ను కూడా ఎనుకుంటారు. సార్వత్రిక ఎన్నికల తరువాత సభ్యుల ప్రమాణ స్వీకారంతో లోక్‌సభ ఏర్పాటు అవుతుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమ నిర్వహణకు ఒక తాత్కాలిక స్పీకరును సభులలో ఒకరిని ఎంచుకుంటారు. సాధారణంగా అనుభవజ్ఞుడైన సభ్యుని ఎంచుకోవడం రివాజు. తరువాత స్పీకరు ఎన్నిక జరుగుతుంది. ఆపై, సభా నిర్వహణ బాధ్యత పూర్తిగా స్పీకరుదే. సభానిర్వహణ కొరకు వివిధ నిబంధనలు ఏర్పాటయ్యాయి. సభ్యుల ప్రవర్తనను నిర్దేశిస్తూ ప్రవర్తనా నియమావళి ఉంది. వివిధ అంశాలకు సమయం కేటాయింపు కొరకు బిజినెస్ ఎడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది.
శూన్య సమయం (జీరో అవర్):--
జీరో అవర్ అనేది భారత పార్లమెంటు సొంతంగా రూపొందించుకున్న పద్దతి. 1962లో పార్లమెంటులో ఈ పద్దతిని ప్రవేశపెట్టారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత జీరో అవర్ ఉంటుంది. ప్రశ్నోత్తరాల కార్యక్రమం 11 గంటలకు, జీరో అవర్ 12గంటలకు ప్రారంభమౌతాయి. ఇందులో ఎలాంటి నోటీసు లేకుండా ప్రశ్నలడగవచ్చు.
సమావేశాలు:--
లోక్‌సభ సమావేశాలు సాధారణంగా ఉ.11 గంటల నుండి మ.1 వరకు, మళ్ళీ మ.2 నుండి 6 వరకు జరుగుతాయి. విషయ ప్రాముఖ్యతను బట్టి ఈ సమయాలు పొడిగించబడటం జరుగుతూ ఉంటుంది. కనీస సంఖ్యలో సభ్యులు ఉంటేనే సమావేశం మొదలవుతుంది. ఈ సంఖ్యను కోరం అంటారు. లోక్‌సభకు కోరం - స్పీకరుతో కలిపి 55. కొత్తగా ఎన్నికై, ఇంకా ప్రమాణస్వీకారం చెయ్యని సభ్యులు ఉంటే, వారి చేత ముందు ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఇటీవలి కాలంలో గతించిన ప్రస్తుత లేదా పూర్వపు సభ్యుల పట్ల సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు.
లోక్‌సభలో కింది ముఖ్యమైన వ్యాపకాలు చేపడతారు.
ప్రశ్నోత్తరాలు: సభ్యుల ప్రశ్నలకు సంబంధిత మంత్రుల సమాధానాలు ఇస్తారు. ప్రశ్నల్లో మూడు రకాలు ఉంటాయి. అవి:
నక్షత్ర గుర్తు గల ప్రశ్నలు. వీటికి మంత్రులు సభలో జవాబిస్తారు. వీటికి అనుబంధ ప్రశ్నలు కూడా అడగవచ్చు
నక్షత్ర గుర్తు లేనీ ప్రశ్నలు: వీటికి రాతపూర్వక సమాధానాలు ఇస్తారు. వీటికి అనుబంధ ప్రశ్నలు ఉండవు.
స్వల్ప అవధి ప్రశ్నలు: పై రెండు రకాల ప్రశ్నలకు జవాబిచ్చేందుకు కనీసం 10 రోజుల వ్యవధి ఉంటుంది. విషయ ప్రాముఖ్యతను బట్టి కొన్ని ప్రశ్నలకు మరింత త్వరగా సమాధాన్ని సభ్యులు ఆశించవచ్చు. వీటిని స్వల్ప అవధి ప్రశ్నలు అంటారు. స్పీకరు అనుమతితో ఇటువంటి ప్రశ్నలు అడగవచ్చు.
ఇతరత్రా వ్యాపకాలు: ప్రశ్నోత్తరాల సమయం ముగిసాక, ఈ కార్యక్రమం చేపడతారు. వాయిదా తీర్మానాలు, హక్కుల తీర్మానాలు, అధికార పత్రాల సమర్పణ, రాజ్యసభ సందేశాలు, సభాసంఘాల నియామకాలు, నివేదికలు, రాష్ట్రపతి ఆమోదముద్ర పొందిన బిల్లుల వివరాలు మొదలైనవి ఇందులో ఉంటాయి.
ప్రధాన వ్యాపకం: వివిధ రకాలైన బిల్లులు, సాధారణ బడ్జట్, రైల్వే బడ్జట్ వంటి ఆర్ధిక అంశాలు, ప్రభుత్వం గానీ, లేదా ప్రైవేటు సభ్యుడు గానీ ప్రవేశపెట్టే తీర్మానాలు ఈ సమయంలో చేపడతారు.
పై వ్యాపకాలు కాక, అరగంట చర్చలు, అత్యవసర ప్రజా ప్రాముఖ్య విషయాలు కూడా సభాకార్యక్రమాల్లో భాగం.
తీర్మానాలు:--
తీర్మానాల్లో అవిశ్వాస తీర్మానం, విశ్వాస తీర్మానం, వాయిదా తీర్మానం మొదలైనవి ఉన్నాయి
అవిశ్వాస తీర్మానం:-0-
ప్రభుత్వాన్ని నియంత్రించే శక్తివంతమైన రాజ్యాంగ పద్ధతుల్లో అవిశ్వాస తీర్మానం ఒకటి. దీన్ని లోక్‌సభలో మాత్రమే ప్రవేశ పెట్టాలి. అవిశ్వాస తీర్మానం ఫలానా అంశంపై అని చెప్పనవసరం లేదు. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతాయి. ఈ తీర్మానాన్ని మొత్తం మంత్రిమండలిపై ప్రవేశపెట్టాలి. అవిశ్వాస తీర్మానాన్ని సభ స్వీకరించడానికి కనీసం 50 మంది సభ్యుల మద్ధతు అవసరం. అవిశ్వాస తీర్మానానికి మద్ధతు ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయాధికారం స్పీకర్ కు ఉంటుంది.
విశ్వాస తీర్మానం:--
దీన్ని కూడా లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి. అధికార పక్షం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది. విశ్వాస తీర్మానంపై చర్చ, ఆ తరువాత ఓటింగ్ జరుగుతాయి. ఓటింగ్ లో ప్రభుత్వం ఓడిపోతే వెంటనే రాజీనామా చేయాలి. భారతదేశం పార్లమెంటు చరిత్రలో మొదటిసారిగా విశ్వాస తీర్మానాన్ని 1979, ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు. అప్పటి చరణ్‌సింగ్ ప్రభుత్వాన్ని సభావిశ్వాసాన్ని పొందవలసిందిగా అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఆదేశించాడు. దాంతో భారతదేశ పార్లమెంటరీ సంప్రదాయాల్లో విశ్వాస తీర్మానం ఆచరణలోకి వచ్చింది.
వాయిదా తీర్మానం:--
ప్రజాప్రాముఖ్యం ఉన్న ఆకస్మిక లేదా హఠాత్ సంఘటనలను చర్చించడానికి స్పీకర్ అనుమతితో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడతారు. దీన్ని ప్రవేశపెట్టేందుకు 50 మంది సభ్యుల మద్ధతు అవసరం. వాయిదా తీర్మానం అనుమతి పొందితే సభలో మిగిలిన వ్యవహారాలన్నీ వాయిదా వేస్తారు. ఈ తీర్మానం యొక్క ముఖ్యోద్దేశం ముఖ్యమైన విషయం మీదకు సభ దృష్టిని మళ్ళించడం. ఈ తీర్మానంపై ఓటింగ్ జరగదు.
సావధాన తీర్మానం:--
ప్రజాప్రాముఖ్యం ఉన్న సమస్యను అత్యవసరంగా చర్చించేందుకు, ఆ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళేందుకు ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఈ తీర్మానం ముఖ్యోద్దేశం సమస్యపై సంబంధిత మంత్రి నుంచి అధికారిక వ్యాఖ్య ను కోరడం. సభ నియమాల ప్రకారం కనీసం ఇద్దరు సభ్యులు స్పీకర్ కు ఒక గంట ముందు నోటీసు ఇవ్వాలి.స్పీకర్ అనుమతి లభిస్తే 2.30 గంటలపాటు చర్చ జరుగుతుంది. ఒక విధంగా ఇది ప్రభుత్వ మందకొడితనానికి చికిత్స లాంటిది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి